
లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు
తుమ్మపాల: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై కలెక్టరేట్‌లోని మంగళవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం 1994ను కఠినంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం లింగనిష్పత్తి వెయ్యి మంది బాలురు, 972 బాలికలుగా ఉందన్నారు. లింగ నిష్పత్తి సమానంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిష్పత్తి మండలాల వారీగా సమీక్షిస్తూ తక్కువగా ఉన్న మండలాల సీడీపీవోలు మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాలికలపై వివక్ష చూపకూడదని తెలిపారు. ఏ లేబొరేటరీగాని, స్కానింగ్ కేంద్రం గాని గర్భస్థ పిండం లింగాన్ని తెలిపే ఉద్దేశంతో చేయరాదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే 102, 104 టోల్ ఫ్రీ నంబరుకు లేదా ఆన్‌లైన్ గ్రీవియన్స్ (pcpndt.ap.gov.i n) ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆడపిల్ల విలువ కట్టలేనిదని వారి రక్షణ బాధ్యత మనదేనని అన్నారు. ఏఎన్‌ఎం, ఆశాలు గృహ సందర్శనాల ద్వారా ఆడపిల్లల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. నూతన వధూవరులకు, గర్భిణులకు, అత్త మామలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాంతిప్రభ మాట్లాడుతూ జిల్లాలో 73 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా 03 కేంద్రాలు గుర్తింపు కోసం, రెండు కేంద్రాలు రెన్యువల్ కోసం, ఒక కేంద్రం మోడిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. స్కానింగు కేంద్రాలను మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నామన్నారు. డెకాయ్ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్‌రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు బాలాజీ, కె.వి.జ్యోతి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆడపిల్లల రక్షణ బాధ్యత మనదే
డీఆర్వో సత్యనారాయణరావు