
40 కిలోల గంజాయి స్వాధీనం
● పట్టుబడిన నలుగురు నిందితులు ● వారిలో ఒక మహిళ
కోటవురట్ల: ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహన తనిఖీ నిర్వహించిన పోలీసులకు 40 కిలోల గంజాయి పట్టుబడింది. నక్కపల్లి సర్కిల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలివి... మంగళవారం యండపల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని తరలిస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిలో ఓ యువతి కూడా ఉంది. గంజాయిని, కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహన్‌వాజ్, షహదాబ్, రుక్సానా కలిసి చింతపల్లి మండలం రేగళ్లు గ్రామానికి చెందిన రాజుబాబు సహకారంతో 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో భాగంగా కారులో చింతపల్లి నుంచి కోటవురట్ల మీదుగా అడ్డురోడ్డుకు వెళ్లి అక్కడి నుంచి తుని మీదుగా ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అక్కడ గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రణాళిక చేశారు. పోలీసుల తనిఖీలో గంజాయితోపాటు నలుగురూ పట్టుబడ్డారు. వీరిలో ఎ –1 ముద్దాయి షెహన్‌వాజ్ గతంలో నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 74/21 కేసులో ఎ–3 ముద్దాయిగా ఉన్నట్టు సీఐ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్‌ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.