
సింహాచలంలో సమన్వయలోపం?
ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం
సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్ చేసి గరుడ సేవపై వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్న ఆమె ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.