
కుటిల సర్కారు గద్దె దిగే రోజు వస్తుంది..
మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. అమర్‌నాథ్ ప్రమాణ స్వీకారంతో తండ్రి తన చేతుల మీదుగా కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నంత ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, త్వరలో రోడ్డెక్కి మరీ ఈ కుటిల సర్కారును గద్దె దించే రోజు వస్తుందన్నారు. కూటమి నాయకులు ఎన్నో దాడులు చేస్తున్నా.. పార్టీ శ్రేణులు ఎదురొడ్డి నిలుస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం చూస్తే రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేఎందుకు సిద్ధంగా ఉన్న సైనికుల్లా కనిపిస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మారిందని, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ.. గతంలో జగనన్న పాలనలో ప్రతి పండగకు ఒక సంక్షేమ పథకం అందుకుని ప్రజలు నిజంగా పండగ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కన్నబాబు రాజు, కంబాల జోగులు, మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. అరకు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, సూర్యనారాయణరాజు, ముఖ్యనేతలు చింతకాయల సన్యాసిపాత్రుడు, ఈర్లె అనురాధ, చింతలపూడి వెంకట్రామయ్య, దంతులూరి దిలీప్ కుమార్, చిక్కాల రామారావు, రుత్తల ఎర్రాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.