
సమస్యలు ఫుల్...పరిష్కారం నిల్...
● కలెక్టరేట్ చుట్టూ అర్జీదారుల ప్రదక్షిణలు ● ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని మండల స్థాయి అధికారులు ● ముప్పుతిప్పలు పెడుతున్నక్షేత్రస్థాయి సిబ్బంది ● వాపోతున్న అర్జీదారులు
తుమ్మపాల : కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో పలువురి సమస్యలు విని తక్షణమే పరిష్కరించాలని చేస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలన ఆయా మండలాల అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తారా... కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరిస్తారా ? అంటూ అర్జీదారుల పట్ల అధికారులు దురుసుగా మాట్లాడుతూ మరిన్ని కొర్రెలు పెడుతున్నారు. దీంతో అర్జీదారులు బెంబేలెత్తి మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కే పరుగులు తీస్తున్నారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కూడా అలాంటి అర్జీలు అనేకం వచ్చాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లి తమ సమస్యను కలెక్టర్‌కు తెలిపే సౌకర్యం లేక దివ్యాంగులు షరామామూలుగానే అర్జీలతో కలెక్టరేట్ డోర్ వద్దనే వేచియుండి వచ్చిన అధికారికి అర్జీలు సమర్పించారు. సమస్యలపై కలెక్టర్‌కు తెలిపేందుకు వచ్చిన పలు సంఘాలవారిలో ఒక్కరికే లోనికి అనుమతించారు. మొత్తం 278 అర్జీలు వచ్చాయి..
కరెంటు, గుక్కెడు నీళ్లు ఇవ్వలేరా...
స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిన చీకటీలోనే జీవిస్తూ బతుకులు సాగిస్తున్నామని విద్యుత్ సౌకర్యం కల్పించి తమకు వెలుగులు ఇవ్వాలని కోరుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి శివారు పీవీటీజీ కొక్కుల బంద, జారురాయి కొత్తవలస గ్రామాల గిరిజనులు కలెక్టరేట్ వద్ద అడ్డాకులు నెత్తిన పెట్టుకుని తమ నిరసన తెలిపారు. కరెంటు సౌకర్యం కల్పించాలంటూ అనేక మార్లు విద్యుత్ శాఖ అధికారులకు కాగితాలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదని, మంచినీటి సౌకర్యం లేక కలుషిత నీరే తాగుతున్నామని అన్నారు. కలెక్టరమ్మ స్పందించి తమ గ్రామాలకు కరెంటు, మంచినీరు అందించేలా చొరవ చూపాలంటూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు.
విలేకరి డబ్బు కాజేశాడు...
వ్యవసాయ భూమిని ఆన్‌లైన్ చేస్తానని రూ.1.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ ప్రైవేటు సంస్థ విలేకరి పి.శ్రీమాన్ అనే వ్యక్తి నుంచి నగదు ఇప్పించాలని కోరుతూ యలమంచిలి కొత్తపేట వీధికి చెందిన శెలంశెట్టి కనకఅప్పలరాజు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. యలమంచిలిలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆన్‌లైన్ చేయిస్తానని, బదులుగా తన వద్ద నుంచి నగదు తీసుకుని ఆన్‌లైన్ చేయించకుండా నాలుగేళ్లుగా తిప్పించుకుంటున్నాడని తెలిపారు. ఆన్‌లైన్ చేయకపోవడంతో నగదు ఇవ్వమని కోరగా నగదు ఇవ్వకుండా తిరిగి తనను భయపెట్టి, హింసిస్తున్నావంటూ పోలీసు కేసు పెట్టించి జైల్లో పెట్టిస్తానంటూ బెదిరిస్తున్నాడని, అతని నుంచి నగదు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
న్యాయం చేయమంటే పోలీసులతో బెదిరిస్తున్నారు...
వందేళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి తమపై దాడులు చేస్తూ కొందరు నాయకులు ఉపాధి హామీ కూలీలతో చెరువును తవ్విస్తున్నారని, తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ గొలుగొండ మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతులు చిపురుబిల్లి కన్నయ్య, కన్నూరు సత్యనారాయణ తమ వద్ద గల భూమి పత్రాలు, ఆధారాలతో కలెక్టర్‌ను కలిసి ప్రాధేయపడ్డారు. రాజుపేట గ్రామంలో సర్వే నెం.15–1బిలో 3 ఎకరాల ఇనాం భూమి తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చి సాగు చేసుకుంటున్నామని, కూటమి ప్రభుత్వంలో కొందరు నాయకులు రాజకీయ కారణాలతో తమపై కక్ష కట్టి మా ఇరువురికి చెందిన 3 ఎకరాల భూమి చెరువంటూ తమకు చెందకుండా చేస్తున్నారని, అధికార బలంతో పోలీసుల అండతో మా భూముల్లో ఉపాధి పనులు చేస్తూ చెరువు గట్టు వేస్తున్నారన్నారు. ఆక్రమణను అడ్డుకున్న తమపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అకారణంగా తమను స్టేషన్‌కు పిలిచి ఫోన్ లాక్కుని ఒక రోజంతా స్టేషన్‌లోనే ఉంచారని, పోలీసులు తాము లేని సమయంలో ఇంటికొచ్చి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సదరు ఈనాం భూమిపై ఈనాంకు చెందిన పంతులు గారికి తమకు మధ్య కొన్నేళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తుందంటూ వారి వద్ద ఉన్న పత్రాలతో కలెక్టర్‌కు వినతి అందించారు. గత వారం నర్సీపట్టణంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అసహనానికి గురై తమపై దురుసుగా మాట్లాడుతున్నారని, సమగ్ర విచారణ చేసి రైతులుగా తమకు న్యాయం చేయమన్న కలెక్టర్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి అదే రోజు తమపై పోలీసు కేసు పెట్టి తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు ఫుల్...పరిష్కారం నిల్...

సమస్యలు ఫుల్...పరిష్కారం నిల్...