
హత్య కేసు మాఫీ యత్నంపై ఎస్పీకి ఫిర్యాదు
● మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి ● కేసును వేరొక అధికారికి బదలాయించాలి ● విలేకరులతో మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం: హత్య కేసును మాఫీ చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారని పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో నర్సీపట్నం మండలం, వేములపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బండారు అప్పన్నపై దాడి చేసి హత మార్చారన్నారు. హత్య చేసిన వ్యక్తులకు కూటమి నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి నాయకుల ఒత్తిడితో కేసును మాఫీ చేసేందుకు నర్సీపట్నం రూరల్ పోలీసులు చూస్తున్నారన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్‌ఎస్‌ఎస్(సస్పైసీవ్ డెత్‌గా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. సంఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ రాజారావు కేసు దర్యాప్తును తప్పుతోవ పట్టించి, కేసును క్లోజ్ చేసేందుకు చూస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. డాక్టర్ ఇచ్చిన పీఎం రిపోర్టు కూడా హత్యకు అద్దం పడుతుందన్నారు. అయినప్పటికీ పోలీసులు కేసును నీరు గారుస్తున్నారన్నారు. మృతుడు అప్పన్న శరీరంపై బలమైన గాయాలు చూస్తే ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, కావాలనే కొట్టి చంపేశారని తెలుస్తుందన్నారు. సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉండడంతో కేసులో నిందితులకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే వేరొక ఆఫీసర్‌కు కేసు బదిలీ చేయాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.