
ఉపాధ్యాయులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
నక్కపల్లి: ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్ ఉపాద్యాయ సంఘ ఆధ్వర్యంలో యలమంచిలి తాలూకా సంఘ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. యలమంచిలి, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులతో ఏపీటీఎఫ్ యూనియన్ నక్కపల్లి శాఖ అధ్యక్షుడు వై.కృష్ణ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సంఘ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటపతిరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం తగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. 12వ పీఆర్‌సీని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని కోరారు. డీఎస్సీ నియామకం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరసన తెలియజేస్తున్నామన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక రోజు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో ఏపీటీఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కె.కె.ధర్మారావు, రాష్ట్ర కౌన్సిలర్‌లు డి. కొండలరావు, పి.గణేష్, కె.శ్రీనివాసరావు, ఐదు మండలాల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌కే రామ్‌రహీమ్, పి.శ్రీనివాసరావు, కృష్ణ, అప్పలరాజు, సునీల్, కె.శ్రీనివాసరావు, బి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, కిరణ్, అప్పాజీ, బి.శ్రీనివాసరావు, ఎస్.ఫాల్గుణరావు, కిల్లాడ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.