
ఏటికొప్పాక బొమ్మల తయారీకి చేయూత
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(పీఆర్‌జీఎస్‌ఏ) రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ తెలిపారు. ఆయన అధికారులతో కలిసి సోమవారం ఆర్టిజెన్స్ కాలనీలో హస్త కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సీవీ రాజు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి, పెదపాటి శరత్, సంతోష్ కుమార్ సహా పలువురితో సమావేశమయ్యారు. లక్కబొమ్మల తయారీలో సరికొత్త మెలకువలు నేర్పించడానికి కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తమకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కావాలని, అంకుడు కర్రల డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రంగుల ధరలు తగ్గించాలని కళాకారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రూ.5 కోట్లతో కొత్త ప్రాజెక్టు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీడీవో కొండలరావు, ఏవో ప్రసాదరావు,ఈవోపీఆర్డీ దీపిక, ఏటికొప్పాక పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.