
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
తుమ్మపాల: భగీరథుడు దీక్షకు, సహనానికి ప్రతిరూపమని, ఎంత కష్టమైనా లెక్కచేయకుండా దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చారని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహర్షి చిత్రపటానికి డీఆర్వో పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు జీవితంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కె.రాజేశ్వరి మాట్లాడుతూ భగీరథుడి వారసులైన ఉప్పర కులానికి చెందిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి రుణాలు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ నూకరాజు, కలెక్టరేట్ ఇన్‌చార్జి ఏవో వాసునాయుడు, ఉప్పర, సగర కమ్యూనిటీ అధ్యక్షుడు నక్క పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.