
గోస్తనీ గొంతెండుతోంది
● ఇసుకాసురుల దాటికి బలైన నది ● తాత్కాలిక పరిష్కారాలతో ప్రజాధనం వృథా ● చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతోనే మేలు
ఇసుక తవ్వకాలతోనే ఈ పరిస్థితి
గత టీడీపీ ప్రభుత్వ(2014–2019) హయాంలో గోస్తనీ నదిలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక తవ్వకాలు నది సహజ స్వరూపాన్ని దెబ్బతీశాయి. పద్మనాభం మండలం పొట్నూరు నుంచి తగరపువలస వరకు ఇసుకాసురులు నది గర్భాన్ని తోడేశారు. కోట్ల విలువైన ఇసుకను తరలించడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా నేడు నదీ పరీవాహక ప్రాంతం ముళ్ల చెట్లు, గోతులతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. నీటి జాడ కనిపించడమే గగనమైపోయింది.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు జీవనాధారమైన గోస్తనీ నది నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీవీఎంసీతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, విజయనగరం జిల్లాలోని పలు పంచాయతీల తాగునీటి అవసరాలను తీర్చే ఈ నది.. ఇసుకాసురుల దాటికి, సరైన ప్రణాళిక లోపంతో ప్రజల దాహార్తిని తీర్చలేని స్థితికి చేరుకుంది. వేసవి వచ్చిందంటే చాలు నది ఎండిపోవడం, ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు, అధికారులు కేవలం తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది.
– తగరపువలస
గోస్తనీ నది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సుమారు 5 నుంచి 6 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఆనందపురం మండలం బోని వద్ద నుంచి జీవీఎంసీకి, పద్మనాభం మండలం పాండ్రంగి సమీపంలోని సామియ్యవలస వద్ద నిర్మించిన ఊట బావులు, పంప్‌హౌస్‌ల ద్వారా భీమిలి జోన్‌కు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం నదీ తీరంలో బోర్లు వేసి.. ఆ నీటిని రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులకు తరలించి ప్రజలకు అందిస్తోంది.
వేసవి కష్టం.. తాటిపూడిపైనే భారం
ప్రతి ఏటా ఏప్రిల్, మేలో గోస్తనీ నది చాలా చోట్ల ఎండిపోతుంది. దీంతో జీవీఎంసీ సహా అనేక పంచాయతీల్లో
తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ఆ సమయంలో వర్షాలు పడితే కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే నీరే దిక్కు. ప్రస్తుతం రెండు వారాల కిందట విడుదల చేసిన నీరు నదిలో చేరినా.. అది కేవలం పది రోజులకు మాత్రమే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోమారు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కావడం లేదా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం జరిగితేనే తాగునీటి సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
తాత్కాలిక కట్టలు.. రూ.లక్షలు వృథా
గోస్తనీ నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే నీటిని నిల్వ చేసుకోవచ్చని మేధావులు సూచిస్తున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో మునివానిపేట నుంచి తగరపువలస వరకు ఒక్క చెక్‌డ్యామ్ కూడా లేదు. గతంలో తాటితూరు వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌ను కొందరు ధ్వంసం చేయడంతో నీరు నిలవడం లేదు. దీంతో భీమిలి జోనల్ అధికారులు ఏటా సామియ్యవలస వద్ద ఇసుక బస్తాలు, మట్టి కట్టల పేరుతో రూ.లక్షలు నదిలో కుమ్మరిస్తున్నారు. ఏప్రిల్‌లో ఏర్పాటు చేసే ఈ తాత్కాలిక కట్టలు.. జూన్‌లో వచ్చే వర్షాలకు కొట్టుకుపోతున్నాయి.
శాశ్వత పరిష్కారమే శరణ్యం
సామియ్యవలస, తాటితూరు, టి.నగరపాలెం వద్ద శాశ్వత చెక్‌డ్యామ్‌లు నిర్మించి, తగరపువలస వద్ద నది గట్టు ఎత్తు పెంచితే.. వర్షాకాలంలో వచ్చే నీటిని సముద్రంలో కలవకుండా నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించవచ్చని.. ఇసుక బస్తాలు, మట్టి కట్టల కోసం ఏటా చేస్తున్న వృథా ఖర్చును తగ్గించవచ్చని రెండు జిల్లాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
బోరు నీళ్లే దిక్కు?
భీమిలి మున్సిపాలిటీ గతంలో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొనేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘నగరబాట’ కార్యక్రమంలో ఇక్కడ ప్రజల కష్టాలు చూసి.. రూ.12 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు. సామియ్యవలస వద్ద పంప్‌హౌస్, ఆరు ఊటబావులు నిర్మించి నిరంతర నీటి సరఫరాకు మార్గం వేశారు. అయితే పాండ్రంగి, మజ్జివలస, తాటితూరు, టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రభావంతో సామియ్యవలస వద్ద కూడా ఏప్రిల్, మేలో నీటి లభ్యత తగ్గిపోతోంది. ప్రస్తుతం రెండు ఊటబావులు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా రెండు బోర్లు తవ్వి నీటిని భీమిలి జోన్ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ బోర్ల నీరు తాగడానికి అనుకూలంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భీమిలిలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు నదిని ఆనుకుని బోర్ల ద్వారా రోజూ వందలాది ట్యాంకర్లతో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమ నీటి రవాణా పలువురికి కాసులు కురిపిస్తోంది.

గోస్తనీ గొంతెండుతోంది

గోస్తనీ గొంతెండుతోంది