
విద్యార్థులకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ
● శిబిరానికి విశేష స్పందన ● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించే యోగా, తైక్వాండోపై శిక్షణ ● జిల్లాలో తైక్వాండో క్రీడకు ఐదు ప్రాంతాల్లో కేంద్రాలు ● యోగాకు చోడవరంలో శిక్షణ కేంద్రం
చోడవరం: విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడలకు సంబంధించి ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగా క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తైక్వాండో అసోసియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రా రంభమయ్యాయి.
తైక్వాండోపై వేసవి శిక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరంగా మారింది. అందులో బాలికలకు ఆత్మరక్షణ ఎంతైనా అవసరం అని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాల, బాలికలు కలిసి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో ఆత్మరక్షణ క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు పట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లి పట్టణం, అనకాపల్లి గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5 నుంచి 16 సంవత్సరాలు వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ ఇచ్చే శిక్షణ తరగుతులకు విద్యార్థులు ఎంతో ఆసక్తితో శిక్షణ పొందుతున్నారని మురళి తెలిపారు.
చోడవరంలో యోగాపై వేసవి శిక్షణ
అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఈ వేసవిలో విద్యార్థులకు యోగాపై ఉచిత శిక్షణ కేంద్రాన్ని చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. చోడవరం ఉషోదయ కాలేజీలో ఈ వేసవి ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

విద్యార్థులకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ