
భూసారం పెరిగేలా ప్రకృతి సాగు
నవధాన్యాల కిట్లు పంపిణీకి సిద్ధం
కశింకోట: మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్న భూములు సారవంతం కావడానికి తొలకరి వర్షాల్లో వేసే నవ ధాన్యాలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరు వద్ద మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో సిబ్బంది సంచుల్లో నింపి రైతులకు సరఫరా చేయడానికి సిద్ధం చేశారు. కేంద్రం నిర్వహకురాలు కూండ్రపు అరుణ ఆధ్వర్యంలో ఏజెన్సీ, ఇతర ప్రాంతాల నుంచి నవ ధాన్యాలైన బొబ్బర్లు, సజ్జలు, రాగులు, ఉలవలు, కూరగాయలు, ఆకు కూరలు, పచ్చి రొట్ట విత్తనాలు, తదితర 30 రకాల విత్తనాలను సేకరించారు. ఎకరాకు 12 కిలోలు సరిపోయే విత్తనాలను కలిపి బ్యాగ్‌ల్లో నింపారు.
2వేల ఎకరాల్లో..
మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. ఆయా భూముల్లో జల్లడానికి వీటిని రూ.1200కు సరఫరా చేస్తున్నారు. అలాగే తెగుళ్లు, క్రిముల నివారణకు వినియోగించే ప్రకృతి సిద్ద ద్రవ్యాలు, కషాయాలు, క్రిమి సంహారక మందులను కూడా సరఫరాకు సిద్దంగా ఉంచారు.ఈ సందర్భంగా అన్ని రకాల విత్తనాలతో అందంగా రూపొందించిన ముగ్గు అందరికి అలరించింది. నవ ధాన్యాలు నాటడానికి ఇదే అదును కావడంతో రైతులు వచ్చి విత్తనాల కిట్లను, ద్రవ్యాలను తీసుకెళుతున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

భూసారం పెరిగేలా ప్రకృతి సాగు

భూసారం పెరిగేలా ప్రకృతి సాగు