
రైలు నుంచి జారిపడి ఒకరి మృతి
మునగపాక: స్నేహితులతో కలిసి తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా తాడేపల్లిగూడెం వద్ద రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఉమ్మలాడ వాసి ఒకరు మృతి చెందిన సంఘటన అందరినీ కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉమ్మలాడకు చెందిన కరోతి గణేష్(34) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్‌లో వస్తుండగా తాడేపల్లి గూడెం జంక్షన్ వద్దకు వచ్చే సరికి కిందికి దిగే ప్రయత్నంలో జారి కింద పడిపోవడంతో మృతిచెందారు. మృతుడు గణేష్‌కు భార్య, ఏడాది వయసున్న పాప ఉన్నారు. అందరితో సరదాగా ఉండే గణేష్ రైలు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియడంతో ఉమ్మలాడలో విషాదం అలముకుంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గణేష్ రైలు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
జగనన్న వీరాభిమానిగా..
గణేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వీరాభిమాని. పార్టీలో చురుకై న పాత్ర పోషిస్తూ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించే గణేష్ రైలు ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానిక పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ బలోపేతంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన పలు సంక్షేమ పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన గణేష్ అకాల మృతితో వారంతా విషాదంలో మునిగిపోయారు. గణేష్ కుటుంబానికి చెందిన కొందరు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా జగనన్నపై ఉన్న అభిమానంతో గణేష్ మాత్రం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారని గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మలాడలో విషాదం