
యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
అచ్యుతాపురం రూరల్ : మండల కేంద్రమైన అచ్యుతాపురంలో ఫ్లై–ఓవర్ నిర్మాణానికి రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన బారికేడ్ (ఇనుప రేకు) బైక్‌పై వెళ్తున్న ఒక యువకునిపై ఒక్కసారిగా పడడంతో బైక్‌తోపాటు రోడ్డుపై ఆ యువకుడు పడిపోయాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ టిప్పర్ లారీ ఒక్క క్షణం ఆలస్యంగా రావడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాడని ఆ యువకునితో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లై–ఓవర్ పనుల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుంటే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు చేసే సెజ్ పూడిమడక రహదారిలో ట్రాఫిక్ నియంత్రణ సరిలేని కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయకుండా వేలాది వాహనాలకు పూడిమడక రోడ్డు ఒక్కటే దిక్కవడంతో అచ్యుతాపురం గ్రామస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోడ్డుపై వెళ్లడానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.