ఈదురు గాలులు.. వర్ష బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులు.. వర్ష బీభత్సం

May 4 2025 6:43 AM | Updated on May 4 2025 6:43 AM

ఈదురు

ఈదురు గాలులు.. వర్ష బీభత్సం

నక్కపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పెద్ద సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మండల కేంద్రం నక్కపల్లితో పాటు ఉపమాక,సారిపల్లిపాలెం, బోదిగళం,మనబానవానిపాలెం, అప్పలపాయకరావుపేట తదితర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.విద్యుత్‌ వైర్లు, స్తంభాలు రోడ్డుపైన, ఇళ్లపైన పడిపోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. నక్కపల్లిలో ఉపమాక రోడ్డు, బండారుపేట, కొత్తపేట, రాజీవ్‌నగర్‌ కాలనీ,వీవర్స్‌ కాలనీ, ఎస్సీ కాలనీ,రెల్లి వీధి,ఎన్టీఆర్‌ బొదిగళ్లంరోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 30 స్తంభాలు నేల కూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎంబీస్వీచ్‌ కండక్టర్లు సైతం విరిగిపోయాయి.జాతీయ రహదారిపై ఉపమాక రోడ్డు ఆర్చి ఎదురుగా కండక్టర్‌ తెగిరోడ్డుపై పడడంతో వాహనాలు నిలిచిపోయాయి.ట్రాన్స్‌కో సిబ్బంది స్థానికులు సాయంతో వైర్లను తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.ట్రాన్స్‌కోకు లక్షల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.ఉపమాక సబ్‌ స్టేషన్‌ నుంచి పలు గ్రామాలకు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆదివారం సాయంత్రానికి మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ పునరుద్ధరణ చేసే అవకాశం ఉందని ట్రాన్స్‌ కో సిబ్బంది తెలిపారు.ప్రస్తుతం నక్కపల్లి పట్టణం అంధకారంలో ఉంది.

యలమంచిలి రూరల్‌: యలమంచిలి పట్టణం,మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏటికొప్పాక,పద్మనాభరాజుపేటల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది.ఫ్లెక్సీలు చిరిగి ఎగిరిపోయాయి.పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.ఉరుములు,మెరుపులతో కురిసిన వర్షానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు.యలమంచిలి పట్టణంలో పలు ప్రధాన వీధిరోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.మురుగుకాల్వలు పూడుకుపోవడం,సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రహదారులు జలమయమవుతున్నాయి. రేగుపాలెం ముస్లిం కాలనీలో ఓ ఇంటి ముందుభాగం కూలింది. కూలిన ఇంటిని గ్రామ సర్పంచ్‌ రాజాన మహాలక్ష్మి,పంచాయతీ కార్యదర్శి రవి పరిశీలించారు. గాలివాన బీభత్సంతో యలమంచిలి పట్టణం సహా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కోటవురట్ల: మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో సుమారు మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం మెయిన్‌రోడ్డులో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. కై లాసపట్నంలో ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా గ్రామానికి చెందిన పేద వృద్ధ దంపతులు కుందూరు అప్పన్న, వెన్నెలమ్మలకు చెందిన పెంకుటిల్లు నేలకూలింది. కుందూరు నాగేశ్వరరావుకు చెందిన పెంకుటిల్లు పైకప్పు కొంత మేర కూలిపోయింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు కోరారు.

మాడుగుల రూరల్‌ : మండలంలో పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కె.జె.పురం జంక్షన్‌, ఎం.కోడూరు, వీరవల్లి అగ్రహారం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కె.జె.పురం– దబ్బకుంటు రహదారిలో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కె.జె.పురం జంక్షన్‌లో తాటి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఘాట్‌రోడ్డు జంక్షన్‌ దాటిన తర్వాత పాడేరు వెళ్లే రహదారిలో రెండు చెట్లు నేలకొరిగాయి. స్థానిక ఎంపీపీ టి.వి.రాజారామ్‌ పర్యవేక్షించి, చెట్లను తొలగించారు.

కశింకోట: మండలం కేంద్రం కశింకోటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోడ్డు గవరపేట, గాడివీధి, స్టేట్‌ బ్యాంకు, పూసర్ల వీధి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండిపోయింది.ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లో గోతుల్లో భారీగా నీరు చేరింది. ఈదురు గాలుల వల్ల మామిడి కాయ లు రాలిపోయాయి. అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు నష్టపోయారు.

నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ఈదురు గాలులు.. వర్ష బీభత్సం 1
1/1

ఈదురు గాలులు.. వర్ష బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement