
లారీకి రూ.10 వేలు!
10వ తేదీలోగా పంపించాల్సిందే.. ● లేదంటే కేసులు పెడతామని హెచ్చరిక
రవాణాశాఖకు సంబంధం లేని వ్యక్తి నేరుగా బెదిరింపులు
డిపార్ట్‌మెంట్ అంటూకార్యాలయంలోనే తిష్ట
సంచలనంగా ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలకు పంపిన ఆడియో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి.. కన్ఫర్మ్ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్ పేలు ఎవరూ చేయవద్దు’ అంటూ అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్. ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఓ వ్యక్తి ధైర్యంగా ఆడియో మెసేజ్ ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలకు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే.. సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్, ఇటు ఫ్లైయాష్.. అంతేకాకుండా సెజ్‌లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాల్సిందే. లేకుంటే దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. అనకాపల్లిలో ఉంటున్న పార్థసారధి అనే వ్యక్తి ఈ ఆడియో మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తే రవాణాశాఖ అధికారులకు జిల్లా మొత్తం నుంచి వసూలు చేసి వాటాలు పంపుతున్నట్టు విమర్శలున్నాయి. రవాణాశాఖకు సంబంధం లేని సదరు వ్యక్తి.. ఎప్పటికప్పుడు రవాణాశాఖ కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటున్నారని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్ యజమాన్యాలకు నేరుగా బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలున్నాయి. మొత్తంగా ప్రతి నెలా రూ.కోటిన్నర మేర వసూలు చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
అటువంటిదేమీ లేదు
ఈ ఆడియోకు మా శాఖకు సంబంధం లేదు. ఎవరు పంపారో తెలియదు. అధిక లోడు, అక్రమంగా రవాణాపై మేం ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నాం. ఏప్రిల్ నెలలో 85 కేసులు రాశాం. తద్వారా అపరాధ రుసుం రూ.65 లక్షల వరకూ విధించాం. అక్రమ రవాణాపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– మనోహర్, జిల్లా రవాణాశాఖ అధికారి
ఇదీ వసూళ్ల లెక్క...!
అనకాపల్లి జిల్లాలో సెజ్‌లకు ప్రతి రోజూ వందల సంఖ్యలో బస్సులు తిరుగుతుంటాయి. ఇక మైనింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ మైనింగ్ లారీలు కూడా వందల్లో తిరుగుతున్నాయి. మరోవైపు రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న నావికాదళ స్థావర పనులు సాగుతున్నాయి. ఈ పనులకు కూడా లారీలు బండరాళ్లు తరలిస్తుంటాయి. సింహాద్రి ఎన్‌టీపీసీకి ప్రతి రోజూ బొగ్గు లారీలతో పాటు అక్కడి నుంచి ఫ్లైయాష్‌ను తీసుకెళ్లే లారీలు కూడా పగలు, రాత్రీ తేడా లేకుండా తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా నిర్ణీత పరిమితి మేర లోడ్‌ను తీసుకుని చక్కర్లు కొట్టడం లేదు. ప్రతి వాహనం కూడా అధిక లోడుతోనే వెళుతున్నాయి. ఇదే వసూళ్లకు కేంద్రంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా రాంబిల్లికి నావికాదళ పనుల కోసం ప్రతి రోజూ 800 ట్రిప్పుల మేర బండరాళ్లను తీసుకెళుతున్నాయి. 800 ట్రిప్పుల నుంచి ప్రతీ నెలా రూ. 10 వేల చొప్పున రూ. 80 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సెజ్‌లకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులను తరలించే వాహనాల నుంచి రూ. 2 వేల నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇవి రూ.20 లక్షల వరకూ ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్‌టీపీసీకి వెళ్లే బొగ్గు లారీలు.. అక్కడి నుంచి ఫ్లై యాష్ తీసుకొచ్చే లారీల నుంచి కూడా రూ.8 వేల చొప్పున ప్రతి నెలా వసూలు చేస్తున్నారు. ఇవి మరో రూ.50 లక్షల మేర ఉంటున్నట్టు సమాచారం. ఈ విధంగా వసూలు మొత్తం ప్రతీ నెలా రూ.1.5 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు శాఖకు సంబంధం లేని వ్యక్తి చేస్తున్నారనే బహిరంగ విమర్శలున్నాయి. ఎవరైనా పార్థసారధి అడిగిన మేర ఇవ్వకపోతే అధికలోడుతో వాహనాలు వెళుతున్నాయని వెంటనే కేసులు నమోదవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

లారీకి రూ.10 వేలు!