
మాతృ మరణాలకు కారణమయ్యే ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు
తుమ్మపాల: నిర్లక్ష్యంగా వ్యవహరించి, మాతృ మరణాలకు కారణమవుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మాతాశిశు మరణాలపై కలెక్టరేట్‌లో శనివారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో సంభవించిన నాలుగు మాతృ, 29 శిశు మరణాలకు గల కారణాలను కేసుల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరైన వైద్యం అందించకుండా మరణాలకు కారణమవుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అనుమతులు, అర్హత కలిగిన డాక్టర్లు లేకుండా వైద్యం చేసి మాతృ మరణానికి కారణమైన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల శ్రీ సూర్య ఆస్పత్రి, పిల్లల కోసం వెళ్లిన వారికి చివరి వరకు వైద్యం చేసి అత్యవసర సమయంలో వైద్యం అందించకుండా బాధ్యతారహితంగా కేజీహెచ్‌కు రిఫర్ చేసిన ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంఘటనలు జరిగి నెలలు కావస్తున్నా సంబంధిత ఆస్పత్రులపై నివేదికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన బంగారి లావణ్య జ్వరం, వాంతులతో బాధపడుతూ విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల శ్రీ సూర్య ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం అత్యవసర పరిస్థితి ఏర్పడితే మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా వారు కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె మరణించినట్టు కలెక్టర్ తెలిపారు. మాకవరపాలెంకు చెందిన గన్ని లక్ష్మి విశాఖపట్నంలో గల ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంలో పిల్లల కోసం వైద్యం చేయించుకోగా, ఎనిమిదవ నెలలో కడుపులో బిడ్డ చనిపోయిన అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌కు రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. శ్రీరాంపురం పీహెచ్‌సీ పరిధిలో పాల్మన్‌పేట గ్రామంలో ఒడిశాకు చెందిన మడద లావణ్య హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ గీతం ఆస్పత్రిలో 19 రోజులు చికిత్స పొందిన అనంతరం కేజీహెచ్‌కు రిఫర్ చేయగా ఆమె కూడా మరణించినట్టు తెలిపారు. నక్కపల్లి పీహెచ్‌సీ పరిధి చినగుములూరుకు చెందిన సయ్యద్ మహబున్నిషా ప్రసవం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేరగా అకస్మాత్తుగా పరిస్థితి విషమించి మరణించినట్టు కలెక్టర్ తెలిపారు. వైద్యులు సేవాదృక్పథంతో ప్రజలకు సేవలందించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.శాంతిప్రభ, డీసీహెచ్‌ఎస్. ఎస్. శ్రీనివాసరావు, డీఐవో కె.చంద్రశేఖర్, శ్రీ సూర్య ఆస్పత్రి, మెడికవర్, ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రం, గీతం ఆస్పత్రి ప్రతినిధులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
విశాఖలోని శ్రీ సూర్య ఆస్పత్రి, ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంపై కేసులు
నమోదుకు కలెక్టర్ ఆదేశం