
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
నర్సీపట్నం: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నోచుకోలేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల 4వ తేదీన నర్సీపట్నంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ర్యాలీకి అనుమతి కోరుతూ పార్టీ నాయకులతో కలిసి ఆయన డీఎస్పీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సారసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలతో మరింత మేలు చేకూరుతుందని ప్రజలు నమ్మి కూటమి ప్రభు త్వాన్ని గెలిపించి మోసపోయారని తెలిపారు. సూపర్‌సిక్స్‌లో ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నిరుద్యోగులు 10 వేల మంది ఉన్నారని, వీరందరికీ రూ. 3 వేల చొప్పున ఏడాదికి రూ.36 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి ఏడాది రూ.15వేల చొప్పున మొత్తం రూ.60.43 కోట్లు చెల్లించాలన్నారు. నియోజకవర్గంలో 42 వేల మందికి రైతు భరోసా పథకం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేసి ఆదుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రూ. 84 కోట్లు రైతులకు అందించాల్సి ఉందని చెప్పారు. మహాశక్తి పథకంలో 19 నుంచి 59 వయస్సు కలిగిన మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ప్రకటించారని, నియోజకవర్గంలోని 90 వేల మంది మహిళలకు రూ.162 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ఉచిత సిలెండర్ల పథకాన్ని అటకెక్కించారని ఆరోపించారు. ఈ ఏడాదిలో ఒక్క సిలిండర్‌కు మాత్రమే నగదు చెల్లించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 50 ఏళ్లు కలిగిన వారు 21 వేలు మంది ఉన్నారని, వీరందరికీ నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి సుమారు రూ.వంద కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఉచిత బస్సు ఊసేలేదన్నారు. అన్ని విధాలా ప్రజల ను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరి పించేందుకు శాంతియుత ర్యాలీ నిర్వహించను న్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎస్పీని కలిసిన వారిలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ సాగిన లక్ష్మణ్‌మూర్తి, మాజీఎంపీపీ రుత్తల సత్యనారాయణ, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, మాకవపాలెం, గొలుగొండ, మాకవరపాలెం మండల అధ్యక్షులు చిటికెల రమణ, లెక్కల సత్యనారాయణ, చిటికెల వెంకటరమణ, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వచ్చేనెల 4న శాంతియుత నిరసన ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
డీఎస్పీకి వినతిపత్రం అందజేత