
అన్నదాన సత్రం కూల్చివేతను అడ్డుకున్న భక్తులు
మాడుగుల రూరల్: మండలంలో కె.జె.పురం జంక్షన్‌లో సంతోషిమాత అన్నదాన సత్రం కూల్చి వేయడానికి పొక్లెయిన్‌తో వచ్చిన అధికారులను ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు, భక్తులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇక్కడ దాతల సహకారంతో ఫిబ్రవరిలో నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఆర్‌అండ్‌బీ స్థలంలో నిర్మించారని స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాపేట రామకొండలరావు మార్చిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ జేఈ సాయి శ్రీనివాస్ సూచనలతో పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్‌దొర ఆలయ కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. గత నెల 29వ తేదీలోపు ఆక్రమణలు తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ జేఈ సాయి శ్రీనివాస్, ఎస్‌ఐ జి.నారాయణరావు, వారి సిబ్బందితోపాటు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి, ఇతర సిబ్బంది పొక్లెయిన్‌తో వచ్చి ఆక్రమణలు తొలగించడానికి సిద్ధమయ్యారు. దీంతో అమ్మతల్లినాయుడు, భక్తులు ఆక్రమణలను తొలగించవద్దని అడ్డుకున్నారు. రోజూ ఎంతో మందికి అన్నదానం చేస్తున్నామని, అటువంటి దాన్ని తొలగించడం అన్యాయమని వాపోయారు. విశ్రాంత ఉపాధ్యాయుడు రామకొండలరావు ఇల్లు ఆర్‌అండ్‌బీ స్థలంలో నిర్మించారని, తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.