
సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..
సత్వరమే ఉచితంగా ఇవ్వాలి
గత ఐదేళ్లు వన నర్సరీల్లో సరుగుడు మొక్కలు పెంచి, సోషల్ ఫారెస్ట్ అధికారులు రైతులకు ఉచితంగా ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, మే ప్రారంభంలో వర్షాలు కురవడంతో సరుగుడు నారు నాటేందుకు అనువైన పరిస్థితి నెలకొంది. దీంతో పొలంలో దుక్కులు కూడా నిర్వహించాం. వన నర్సరీల్లో సరుగుడు మొక్కలు సిద్ధంగా ఉన్నా అధికారులు పంపిణీ చేయడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవంటున్నారు. ఈ ఏడాది నర్సరీల్లో సరుగుడు నారుకు ధర నిర్ణయించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగానే ఉచితంగా సరుగుడు నారు ఇవ్వాలి.
– దొగ్గ పైడంనాయుడు, రైతు,
పొడుగుపాలెం
ఎకరా పొలంలోసరుగుడు సాగు
కొత్త అగ్రహారం గ్రామంలో గల ఎకరా పొలంలో గత ఏడాది సరుగుడు సాగును ప్రారంభించాము. వన నర్సరీలో సోషల్ ఫారెస్ట్ అధికారులు ఉచితంగా మాకు 5 వేల సరుగుడు మొక్కలను ఇచ్చారు. ఈ మొక్కలను నాటిన ఏడాదిలోగానే పంట ఆరోగ్యకరంగా ఎదిగింది. మరో మూడేళ్లలో పంట కోతదశకు చేరుకోనున్నది. పంట ప్రారంభంలోనే పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. చెరకు పంటతో పోల్చితే సరుగుడుకు పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది. చెరకు పంటకు సాగు ఖర్చులు పెరిగిపోవడంతోపాటు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం కారణంగా సరుగుడు పంటను వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– యడ్ల రమణమ్మ, సరుగుడు సాగు రైతు, కొత్త అగ్రహారం
ఉన్నతాధికారుల ఆదేశాలతో పంపిణీకి చర్యలు
కలెక్టర్ ఆదేశాల మేరకు వన నర్సరీల్లో గల సరుగుడు మొక్కల పంపిణీని చేపట్టనున్నాం. వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ నెల నుంచి పంపిణీ చేపట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా సరుగుడు పంటకు నర్సరీల్లో ప్రతి రోజూ నీటి తడులను అందిస్తూ, మొక్క ఆరోగ్యకరంగా ఉండేటట్లు సంరక్షిస్తున్నాం.
– జి.లక్ష్మణ్, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో
●
కొత్త అగ్రహారం వన నర్సరీలో సరుగుడు నారు
కె.కోటపాడు: సరుగుడు సాగుకు ఈ ఏడాది ఎప్పుడూ లేనంత ఆసక్తి పెరిగింది. చక్కెర కర్మాగారాల్లో అనుకూల పరిస్థితి లేకపోవడం, బెల్లం అమ్మకాలు కూడా మందగించడంతో ఈ ఏడాది రైతులు చెరకు బదులు సరుగుడు వైపు చూస్తున్నారు. సాధారణ పంటల సాగు ఖర్చులు పెరగడంతోపాటు మంచి మద్దతు ధర లభించకపోవడంతో కొంతకాలంగా సరుగుడు సాగుకు ఆదరణ పెరిగింది. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ లభించడంతో అందరూ ఇటే మొగ్గు చూపిస్తున్నారు. దానికి తోడు చెరకు ఎఫెక్ట్‌తో ఈసారి సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, రావికమతం తదితర మండలాల్లో చెరకు పంటను సాగు చేసిన పొలాల్లో ఈ ఏడాది సరుగుడును పెంచేందుకు రైతులు ముందుకు వస్తున్నారు.
వన నర్సరీల్లో సిద్ధంగా ఉంది.. కానీ..
జిల్లాలో సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో 44 చోట్ల వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ వన నర్సరీల్లో సుమారు 33 లక్షల సరుగుడు నారును పెంచుతున్నారు. ఐదారు నెలల కాలం సరుగుడు నారును ఆరోగ్యకరంగా పెంచి రైతులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. నారు ఎదిగిన తరువాత వాటిని ఎర్రమట్టి, ఎరువు వేసిన కవర్లలో ఉంచి ప్రతి రోజూ నీటి తడులను అందించి ఆరోగ్యకరంగా ఎదిగేలా చర్యలను తీసుకుంటున్నారు. ఈ వన నర్సరీల ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సన్న, చిన్నకారు రైతులతో పాటు ఉపాధి కూలీలకు ఉచితంగా సరుగుడు నారును అందించారు. ఈ ఏడాది సరుగుడు నారుకు స్వల్ప ధరను వసూలు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పైనుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో రైతులు కోరుతున్నా సోషల్ ఫారెస్ట్ అధికారులు వన నర్సరీల్లో పెంచిన సరుగుడు నారును ఇవ్వలేకపోతున్నారు. ధర నిర్ణయించాల్సి ఉంది. వర్షాలు పడి నారు నాటాలని ఆశ పడిన రైతులు దీంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇచ్చిన మాదిరీగానే ఈ ఏడాది కూడా వన నర్సరీల్లో పెంచిన సరుగుడు నారును సత్వరమే ఉచితంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
చెరకు పంటకు మద్దతు ధర లేకపోవడంతో సరుగుడు సాగుపై రైతుల ఆసక్తి
గత ఐదేళ్లు వన నర్సరీల్లో నారు పెంచి రైతులకు ఉచితంగా అందించిన సోషల్ ఫారెస్ట్ శాఖ
ఈ ఏడాది స్వల్ప ధరకు విక్రయించాలని ఉన్నతాధికారుల యోచన
వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్న సోషల్ ఫారెస్ట్ అధికారులు
వర్షాలు కురవడంతో నారును సత్వరమే పంపిణీ చేయాలని కోరుతున్న రైతులు

సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..

సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..

సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..

సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..