
వృద్ధులే మనకు మార్గదర్శకులు
కశింకోట: గతానికి వర్తమానానికి వృద్ధులు వారధి లాంటి వారని, భవిష్యత్‌కు మార్గదర్శకులని రాష్ట్రపతి ద్రౌపది ముర్రు అన్నారు. కశింకోట మండలంలోని జి.భీమవరం గ్రామంలో పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీకాప్డ్ అండ్ స్పాస్టిక్స్ నిర్వ హించనున్న వృద్ధాశ్రమంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ఐదు ఆశ్రమాలను శుక్రవారం రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’ కార్యక్రమం పురస్కరించుకొని రాష్ట్రపతి మీట నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రత్యక్షంగా వృద్ధులు, అధికారులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం మన దేశ సంస్కృతిలో భాగమన్నారు. నేటి పోటీతత్వం, వేగవంతమైన జీవితంలో సీనియర్ సిటిజన్ల మద్దతు, ప్రేరణ, మార్గదర్శకత్వం యువతరానికి అతి ముఖ్యమైనవన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉన్న అనుభవాలు, జ్ఞానం యువతరానికి సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయన్నారు. మన వృద్ధులు గౌరవంగా, చురుగ్గా జీవించేలా చూసుకోవడం మన సమష్టి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఢిల్లీలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం ప్రతిజ్ఞ చేయించారు.
ఈ ఏడాది 15 వృద్ధాశ్రమాలు
ప్రారంభోత్సవం అనంతరం ఇక్కడ జరిగిన సమావేశంలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ పదేళ్ల తర్వాత మొదటి సారిగా రాష్ట్రానికి ఈ ఏడాది 15 వృద్ధాశ్రమాలు మంజూరయ్యాయన్నారు. గత నెల రోజుల వ్యవధిలో లక్ష సీనియర్ సిటిజన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. అవసరమైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లోగాని, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయాల్లోగాని, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్డు వల్ల ఐదు లక్షల రూపాయల వైద్య బీమా సదుపాయం కలుగుతుందన్నారు. ఇక్కడి వృద్ధాశ్రమాన్ని రెండేళ్లపాటు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తర్వాత సవ్యంగా పనిచేస్తే కొనసాగిస్తామన్నారు. రెండేళ్లు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎ.రవిప్రకాష్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.అశయ్య, పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీకాప్డ్ అండ్ స్పాస్టిక్స్ నిర్వాహకురాలు డి.రజని, కార్యదర్శి ఎం.సత్యవాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె.అనంతలక్ష్మి, ఎంపీడీవో వి.వి.రవికుమార్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటలక్ష్మి, హెచ్‌డీటీ భాస్కరరావు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
వారిని కంటికి రెప్పలా చూసుకుందాం:
రాష్ట్రపతి ద్రౌపది ముర్రు
జి.భీమవరంలో వర్చువల్‌గా వృద్ధాశ్రమం ప్రారంభం

వృద్ధులే మనకు మార్గదర్శకులు