
జీవీఎంసీ నిర్వాకం.. అనధికార కట్టడం
సాక్షి, అనకాపల్లి: సామాన్యులకై తే ఒక న్యాయం.. జీవీఎంసీకై తే మరో న్యాయమా? అనుమతులు లేకుండా ఎవరైనా ఇల్లు నిర్మిస్తే అక్రమ నిర్మాణమంటూ స్వయానా జీవీఎంసీ అధికారులే కూల్చేస్తారు. మరి వారే ప్లాన్ అప్రూవల్ లేకుండా భవనం నిర్మిస్తే.. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని సుంకరమెట్ట జంక్షన్‌కు సమీపంలో ఎస్‌బీఐ కాలనీ లేఅవుట్‌లో జాయింట్ కలెక్టర్ నివాసముంటున్న బంగ్లా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లో పార్కు కోసమని 1983లో 22 సెంట్ల స్థలం కేటాయించారు. 40 ఏళ్లుగా ఉన్న ఆ స్థలంలో సుమారు రూ.1.2 కోట్లతో ఎటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా జీవీఎంసీ ఒక బంగ్లా నిర్మించింది. అది అనకాపల్లి వచ్చినప్పుడు జీవీఎంసీ కమిషనర్ విశ్రాంతి తీసుకోవడానికి కట్టామని, ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌కు కేటాయించినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అందులో ఇటీవలే జేసీ జాహ్నవి గృహప్రవేశం కూడా చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కు స్థలంలో శాశ్వత నిర్మాణం ఎలా చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని నిర్మాణ సమయంలో సామాజిక కార్యకర్త కాండ్రేగుల వెంకటరమణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆయన ఆర్‌టీఐను ఆశ్రయించగా ఈ బంగ్లా నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ లేదని జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయం బదులిచ్చింది. ఈ బంగ్లా స్థలంలో యధావిధిగా పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని, అలా కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
ప్లాన్ అప్రూవల్ లేకుండా బంగ్లా కట్టేశారు..
వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లోని 22 సెంట్ల పార్కు స్థలంలో నిర్మాణం
ఆర్‌టీఐ దరఖాస్తుతో బట్టబయలైన ఉల్లంఘన

జీవీఎంసీ నిర్వాకం.. అనధికార కట్టడం