
వడ్డాదిలో పశు వైద్యాధికారి కోసం నిరీక్షణ
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది పశువుల ఆస్పత్రి వైద్యాధికారి కోసం పాడి రైతులు శుక్రవారం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. వడ్డాదికి చెందిన గుమ్మిడి ప్రసాద్‌కు చెందిన గొర్రెపోతును శుక్రవారం ఉదయం కుక్కలు కరిచాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గొర్రెను వైద్య సేవల కోసం స్థానిక ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి ఉదయం 9 గంటలకు తీసుకొచ్చారు. అప్పటికీ పశు వైద్యాధికారి విధులకు హాజరు కాలేదు. ఈలోగా పలువురు రైతులు తమ పశువులు, కుక్కలు, కోళ్లు, ఇతర మూగ జీవాలను వైద్య సేవల కోసం తీసుకొచ్చి నిరీక్షించారు. ఎట్టకేలకు ఉదయం 11.40 గంటలకు పశు వైద్యాధికారిణి విధులకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు నిరీక్షించిన రైతులు ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తరచూ విధులకు ఆలస్యంగా రావడంపై రైతులు గుమ్మిడి ప్రసాద్, గొంతిన లక్ష్మీనారాయణ, బొబ్బరి ఈశ్వరరావు తదితరులు మండిపడ్డారు. రోజూ విధులకు ఆలస్యంగా వస్తే మూగ జీవాలకు ఎలా వైద్య సేవలు అందుతాయని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. బస్సులు సకాలంలో రాకపోవడంతో ఆలస్యమైందని వైద్యాధికారి చెప్పినా రైతులు శాంతించలేదు.
సకాలంలో మూగ జీవాలకు అందని వైద్య సేవలు
ఉదయం 11.40 గంటలకు వచ్చిన వైద్యాధికారిపై రైతుల ఆగ్రహం