
కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్ అభినందన
తుమ్మపాల : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందనలు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశంలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కేజీబీవీ విద్యాలయాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పదో తరగతి ఫలితాలలో రెండో స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటిస్థానం సాధించడం అభినందనీయమని, వచ్చే సంవత్సరం కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటరు ఆర్. జయప్రకాష్ జిల్లా ఫలితాలను వివరిస్తూ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి పదో తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించడం జరిగిందని, జిల్లాలో గల 20 పాఠశాలలకు 8 పాఠశాలలో నూరుశాతం ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. 20 కళాశాలలకు 5 పాఠశాలలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 550 పైగా మార్కులు సాధించిన 40 మంది పదో తర గతి విద్యార్థినులను, 950 పైగా మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థినులను వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఏలూరు జిల్లా అగిరిపల్లిలో గల హిల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఒలింపిక్ ఆటల పోటీలలో ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికై నట్టు తెలిపారు.