
విజయదశమికి నూకాంబిక నూతన ఆలయం
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం పనులు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది ఽవిజయదశమి రోజున ప్రారంభించనున్నామని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి చెప్పారు. స్థానిక గవరపాలెం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అమ్మవారి కొత్త అమావాస్య నెల రోజుల జాతర అందరి సహకారంతో విజయవంతమైందన్నారు. నెలరోజులపాటు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆమె చెప్పారు. మే మాసంలో ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల రోజుల్లో సుమారు రూ.కోటి 16 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) మాట్లాడారు. ఆలయ ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు తదితరులు పాల్గొన్నారు.