
దాడికి పాల్పడ్డవారిపై చర్య కోరుతూ ఏఎస్పీకి ఫిర్యాదు
అనకాపల్లి: నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో తమ కుటుంబానికి న్యాయం జరగలేదని నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామానికి చెందిన ఆవాల సురేష్, ఆవాల నాగేశ్వరరావు, చిట్టెమ్మతో పాటు మరో 30 మంది కుటుంబ సభ్యులు గురువారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామానికి చెందిన వెలమశెట్టి శ్రీను, సోమరాజు జయంత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన ఆవాల సురేష్, లక్ష్మిలను తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని, సురేష్‌ను నక్కపల్లి, లక్ష్మి (61)ని తుని ఆస్పత్రిల్లో చేర్పించడం జరిగిందన్నారు. దీనిపై 5తేదీన నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో అవాల సురేష్ ఫిర్యాదు చేసినప్పటికీ క్షతగాత్రులకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి చికిత్స పొందుతూ ఏప్రిల్ 8న మృతి చెందిందని, అప్పటి నుంచి క్షతగాత్రుల కుటుంబానికి నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగలేదని, తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్టు ఆవాల సురేష్, నాగేశ్వరరావు చెప్పారు. అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.