
మొదటి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి
తుమ్మపాల: ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు సక్రమంగా, సకాలంలో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కోడూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో గురువారం ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు పింఛన్ల నగదు అందించారు. ప్రతి నెలా పింఛను సక్రమంగా అందుతుందా, ప్రభుత్వం అందిస్తున్న పింఛను డబ్బులు పూర్తిగా అందుతున్నాయా, పింఛను అందజేస్తున్నపుడు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్లు అందుకున్నప్పుడు డబ్బులు సరి చూసుకోవాలన్నారు. ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పింఛను పంపిణీ వేగంగా జరగాలన్నారు. లబ్ధిదారులు పింఛన్లు పంపిణీ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి రోజే శత శాతం పంపిణీ పూర్తి జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, ఎంపీడీవో నర్శింగరావు, గ్రామ సర్పంచ్ సేనాపతి లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.