
కొండకొప్పాకలో రెండు ఇళ్లలో చోరీ
అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన కొండకొప్పాకలో రెండు ఇళ్లలో చోరీ జరిగినట్లు రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. రూరల్ సీఐ అశోక్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొండకొప్పాక గ్రామంలో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఎం.సత్యనారాయణ బుధవారం గాజువాక మండలం కూర్మన్నపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లి గురువారం వచ్చి చూసేసరికి ఇంట్లో తులంన్నర బంగారు ఆభరణాలు, రూ.5వేలు నగదు కనిపించలేదు. అదే గ్రామంలో విశ్రాంత హెచ్‌ఎం పీలా బాలగణపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 2 కేజీల వెండి, లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.