
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి
సీతమ్మధార: వైద్య ఆరోగ్య శాఖలో, జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాల్గవ రోజు కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కొందరు మహిళా ఉద్యోగులు తమ చిన్న పిల్లలను ఒడిలో పట్టుకుని నిరసన తెలిపారు.ధర్నా శిబిరాన్ని సందర్శించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ, ఆరోగ్య శాఖలో కీలకమైన విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఎస్.ఎన్ ప్రజ్ఞ, కార్యదర్శి గంట సుధ మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ నుండి సీహెచ్‌వోలకు మిన హాయింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్ గ్రేషియా, పితృత్వ సెలవులు వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జి.సుధారాణి, పి.దివ్య, బి.శ్రావణి, టి.మోషే, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.