
కొత్తపెంట కొత్తూరు పైడిమాంబ ఆలయంలో భారీ చోరీ
● ముప్పావు తులం బంగారం, మూడున్నర కేజీల వెండి అభరణాలు చోరీ ● చోరీ సొత్తు విలువ రూ. 4 లక్షలు పైమాటే. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ పైడపునాయుడు ● క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ
దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంట శివారు కొత్తూరు లోని పైడిమాంబ అమ్మవారి ఆభరణాలు చోరీకి గుర య్యాయి. దొంగత నానికి సంబంధించి స్థానిక సర్పంచ్ వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ దేవత పైడిమాంబ అమ్మవారి మెడలో ముప్పావు తులం బంగారు మంగళ సూత్రాలు, మూడున్నర కేజీల వెండితో తయారీ చేసిన కిరీటం తదితర ఆభరణాలు అమ్మవారికి అలంకరణ చేశామన్నారు. బుధవారం రాత్రి దొంగలు ఆలయ తలుపు గడియ ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడి అమ్మవారికి అలంకరించిన అభరణాలన్నింటిని దోచుకుపోయారన్నారు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలకు పైబడి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించడంతో ఈ దొంగతనం విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. చోరీ జరిగినట్టు పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు చోరీ జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. అనకాపల్లికి చెందిన క్లూస్ టీమ్‌ను రప్పించి దొంగతనం జరిగిన ప్రాంతంలో ఆధారాలతో పాటు వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

కొత్తపెంట కొత్తూరు పైడిమాంబ ఆలయంలో భారీ చోరీ