
క్లూ లేకున్నా.. కేసు ఛేదించారు
సబ్బవరం: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన వ్యక్తుల నుంచి చైన్ రికవరీ చేసి, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. క్లూ లేకున్నా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సింహాచలం, దివ్యతో కలసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిలోని చిన్నయ్యపాలెం వద్ద చినముషిడివాడకు చెందిన శ్రీనాథ జగన్నాథం ఈ నెల 26న అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆయన మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తీసుకుని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఆ సమయంలో సబ్బవరం నుంచి పెందుర్తి వైపు ద్విచక్రవాహనంపై వెళ్లి, షాపుల వద్ద ఆగిన వారి వివరాలను సాంకేతిక సహాయంతో గుర్తించి, నిందితులను పట్టుకున్నారు. వారిని పెందుర్తి ప్రాంతానికి చెందిన సయ్యద్ నిజాముద్దీన్(25), బానుగుల నవీన్(27), పెనుమళ్ల చంద్రశేఖరరావు(45)గా గుర్తించారు. వారు సుమారు రూ.2 లక్షలకు పైగా విలువ చేసే ఆ చైన్‌ను బయట మార్కెట్‌లో రూ.1.5 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ చైన్‌ను రికవర్ చేసి, కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎటువంటి క్లూ లేకపోయినా, చాకచక్యంతో కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి గొలుసు చోరీ
సాంకేతికత సహాయంతో నిందితుల గుర్తింపు
రెండు తులాల గోల్డ్ చైన్ రికవరీ