
హా.. నరహరీ
ఆర్తనాదాలతో మార్మోగిన సింహగిరి
● పాలకుల నిర్లక్ష్యానికి ఏడు ప్రాణాలు బలి ● సింహాచలం చరిత్రలోనే తొలిసారి విషాదం ● మృత్యుఘోష వినకుండా.. దర్శనాలపైనే వీవీఐపీల దృష్టి ● వీఐపీ దర్శనాల కోసమే పనిచేసిన మంత్రుల కమిటీ
చీకటిలో మృత్యు ఘోష
బుధవారం వేకువజామున 2.22 గంటలకు ఈదురుగాలులు మొదలయ్యాయి. 2.25 గంటలకు గాలుల తీవ్రత పెరిగింది.. అప్పటికే వేలాది మంది భక్తులు క్యూల్లో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 2.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. 2.45 గంటలకు ఈదురుగాలులతో భారీ వర్షంగా మారింది. క్యూల్లో వేల మంది భక్తులు తలదాచుకునేందుకు సరైన వసతి లేదు. రూ.300 టికెట్ క్యూల్లోని భక్తులు వర్షపు నీరు రాని చోట ఆగారు. మరికొందరు తడిసి ముద్దవుతూనే స్వామి దర్శనం కోసం ముందుకు కదిలారు. సరిగ్గా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పైభాగం నుంచి ఇంకో 100 మీటర్లు ముందుకు వెళ్తే స్వామి దర్శనం కలుగుతుంది. ఇంతలో ఊహించని విపత్తు.. సరిగ్గా 3.05 గంటలకు కొత్తగా నిర్మించిన గోడపైకి వరదనీరు వచ్చింది. దీంతో గోడ బీటలు వారింది. టెంట్ గోడపైనే ఏర్పాటు చేయడంతో ఈదురుగాలులకు కూలిపోయింది. అదే సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి భక్తులపై పడింది. గోడ శిథిలాల కింద ఏడుగురు భక్తులు చిక్కుకొని మృత్యు ఒడికి చేరారు.
సాక్షి, విశాఖపట్నం : నిత్యం నృసింహుని నామస్మరణతో పులకించే పవిత్ర సింహగిరి.. భక్తుల ఆర్తనాదాలతో కన్నీటి సంద్రమైంది. గోవిందా.. గోవిందా.. సింహాద్రి అప్పన్నా.. కాపాడు అని ఆ దేవ దేవుడిని వేడుకునే భక్తకోటి గొంతులే.. ప్రాణభయంతో రక్షించండి.. చచ్చిపోతున్నాం అంటూ హాహాకారాలు పెట్టాయి. సింహాద్రినాథుని నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల ఆశలు అక్కడికక్కడే సమాధి అయ్యాయి. స్వామి దర్శనానికి అడుగుల దూరంలో ఉండగానే.. కొందరు అనంతలోకాలకు చేరుకున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఈ మహా విషాదం.. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కనులపండువగా జరగాల్సిన చందనోత్సవం.. ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, మంత్రుల ప్రచార యావ, ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారుల చేతకానితనంతో తీరని దుఃఖాన్ని, అంతులేని వేదనను మిగిల్చింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘోర వైఫల్యోత్సవంగా.. ఈ చందనోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది.
భక్తుల ప్రాణాలకు విలువేదీ?
రెండు వారాలుగా ఐదుగురు మంత్రుల కమిటీ పేరుతో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. సమీక్షల మీద సమీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లంటూ ప్రగల్భాలు పలికారు. కానీ.. క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం. ఏటా చందనోత్సవం రోజు వర్షం కురవడం ఆనవాయితీ. ఈ చిన్నపాటి ముందుచూపు కూడా లేకుండా.. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు, మంత్రులు ఏం చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వారి దృష్టి అంతా వీఐపీ టికెట్ల పంపకాలు, ప్రచార ఆర్భాటంపైనే కేంద్రీకృతమైంది తప్ప.. సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రత పట్టలేదు. ఫలితం ఈ ఘోర విషాదం.

హా.. నరహరీ

హా.. నరహరీ