
5వ తేదీ నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
కె.కోటపాడు : వచ్చే నెల 5, 6, 7 తేదీలలో అనకాపల్లి జిల్లా యలమంచిలిలో సీపీఐ జిల్లా 2వ మహాసభలు జరగనున్నట్లు ఆ పార్టీ జిల్లా సమితి సభ్యుడు వేచలపు కాసుబాబు తెలిపారు. కె.కోటపాడులో మంగళవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఈ సమావేశాలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి హజరవుతారన్నారు. అనకాపల్లి జిల్లాలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అయితే ఈ ఏడాది క్రషింగ్ కూడా సక్రమంగా జరిగే పరిస్థితి ఫ్యాక్టరీలో లేకపోయిందని కాసుబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది అవుతున్నా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీపీఐ మహాసభలో గోవాడ సుగర్స్ అంశాన్ని చర్చిస్తామన్నారు. జిల్లా మహాసభలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాసుబాబు కోరారు.