
పద్యమేవ జయతే..
● తెలుగు ఉపాధ్యాయుల కృషి ● మాతృభాషపై విద్యార్థులకు మమకారం పెరిగేలా కార్యక్రమాలు ● అనంతచ్చందం సహకారంతో తర్ఫీదు ● గూగుల్ లింక్ ద్వారా పద్య పోటీలు ● విజేతలకు ప్రశంసాపత్రాలు
నక్కపల్లి : శాఖోపశాఖలుగా వికాసం పొందిన కావ్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ఆరంభమై కాలక్రమేణ విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందింది. ప్రాచీన కాలం నుంచి కనీవినీ ఎరుగని ఎన్నో శతక రచనలు విశిష్టమైన కవుల వివరాలు సేకరించి విద్యార్థులకు పరిచయం చేసి వారిలో పద్యపఠనం పట్ల ఆసక్తి కల్పిస్తోంది అనంతచ్చందం అనే సంస్థ. శతక పద్య పఠనంపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ వారిలో ఆసక్తి పెంచుతూ బోధన చేస్తున్నారు బోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు. ఇటీవల ఉపమాకలో శతక పద్యాలపై అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళ్లి ముఖ్య అతిథులుగా హాజరైన అష్టావధానుల్లో ఎంతో మంది నిష్ణాతులకు పరిచయం చేసి వారి సందేహాలను నివృత్తం చేయడమే కాకుండా పద్యపఠనంపై వారిలో మరింత ఆసక్తి పెరిగేలా కృషి చేశారు. ఇదే కార్యక్రమంలో పద్యపఠనంపై ప్రముఖ కవులు, అష్టావధానుల సమక్షంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆన్‌లైన్ పద్య పోటీలు
పద్య రచనలు చేయడంలో అనంతచ్చందం, మహతి చానల్ వారి సహకారంతో పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు నిస్తున్నారు. అనంతచ్చందం వారి సహకారంతో పద్యగురు తోపెళ్ల బాల సుబ్రహ్మణ్యశర్మ ఆద్వర్యంలో ప్రతి నెలా నాలుగో ఆదివారం గూగుల్ లింక్ ద్వారా ఆన్‌లైన్ పద్య పోటీలను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు చిన్న వయసులోనే పద్య పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు మాతృభాషపై మమకారం పెంచేలా తెలుగు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్ లింక్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్థానిక విద్యార్థులతోపాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగువారు, తెలుగు భాషపై మమకారం ఉన్న వారు పాల్గొనడం విశేషం.పద్యపోటీల్లో విజేతలకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు సైతం అందజేస్తున్నారు.
పెదబోదిగల్లం జెడ్పీపాఠశాలలో...
ఆరు మాసాలుగా పెద బోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఎన్.వి.ఎస్. ఆచార్యులు ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పద్య పఠనం, పద్య రచనపై మంచి తర్ఫీదునిస్తూ పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నారు. రోజూ పాఠశాలలో కొంత సమయాన్ని వీరి కోసం కేటాయించడం గమనార్హం. పద్య పఠనంతో విద్యార్థుల్లో ధారణ శక్తి పెంపొందడమే కాకుండా మానసిక వికాసం, భాషపై పట్టు సాధించడానికి వీలు కలుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పద్యమేవ జయతే..

పద్యమేవ జయతే..