
మేక కోసం వచ్చి మృత్యువాత
● ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ ● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
నక్కపల్లి : మేక కోసం వచ్చి ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన మంగళవారం నక్కపల్లి వారపు సంత సమీపంలో జరిగింది. జాతీయరహదారిపై నక్కపల్లి వారపు సంత సమీపంలో ట్రాక్టర్‌ను ట్యాంకర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. సీతంపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో ముగ్గురు కూలీలు అడ్డురోడ్డు వెళ్తున్నారు. వారపు సంత సమీపంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న ట్యాంకర్ లారీ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకు పోయింది. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ రోడ్డుపక్కన మేకను పట్టుకుని కూర్చొన్న వ్యక్తిపై బోల్తాపడడంతో సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన మామిడి సత్తిబాబు(40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో సీతంపాలెం గ్రామానికి చెందిన ప్రసాదుల భాస్కరరావు, మేకల నాగేంద్ర, మడగా శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.
సారిపల్లిపాలెంలో విషాదం
సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు మేకలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగానే జాతీయరహదారి పక్కన ఉన్న పొలాల్లోకి మేకలను మేపుకోడానికి వచ్చాడు. మేకల మందలో ఒక మేక తప్పిపోయి జాతీయ రహదారి సమీపానికి రావడంతో అక్కడకు వచ్చిన సత్తిబాబు మేకను పట్టుకుని ఎండ వేడిమి తట్టుకోలేక రోడ్డుపక్కన చెట్టు నీడన కూర్చుని సేదతీరుతున్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్‌ను ట్యాంకర్ లారీ ఢీకొనడం, అది సత్తిబాబుపై పడడంతో ట్రాక్టర్ కిందపడి సత్తిబాబు మృత్యువాత పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమానిని కోల్పొవడంతో కుటుంబం రోడ్డున పాలైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కుమార స్వామి తెలిపారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తాతబాబు పరామర్శించారు.

మేక కోసం వచ్చి మృత్యువాత