
పంట కోతలు వాయిదా వేసుకోవాలి
శాస్త్రవేత్తల సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్ ఏడీఆర్ రమణమూర్తి
అనకాపల్లి : గాలులు, వర్ష సూచన ఉన్నందున, కోత దశలో ఉన్న వరి, వేరుశనగ, నువ్వుల పైరులను కోయడం వాయిదా వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్‌ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కె.వి.రమణమూర్తి అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరకులో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు పీకపురుగు ఆశించవచ్చని, నివారణకు క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మీ.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. చెరకులో రాగల వర్షాన్ని వినియోగించుకుని పై పాటు ఎరువును అనగా 45 రోజుల వయసు గల కార్సి చేసిన పైరులో ఎకరాకు 150 కిలోల యూరియాను 90 రోజుల వయసు గల చెరకు మొక్క తోటల్లో 75 కిలోల యూరియాను పై పాటుగా వేసుకోవాలని అన్నారు. పక్వానికి వచ్చిన అరటి గెలలను, మామిడి, బొప్పాయి వంటి పండ్లను, కూరగాయలను వెంటనే కోసి మార్కెట్‌కు తరలించాలని సూచించారు. అలాగే పక్వానికి వచ్చిన మిరప కాయలను వెంటనే కోసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న పొలాల్లో వేసవి లోతు దుక్కు చేసుకునే తరుణం ఇదేనని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, ఎ.శిరీష, పి.వి.పద్మావతి, ఎ.అలివేణి పాల్గొన్నారు.