
పేదరిక నిర్మూలనలో మార్గదర్శులను గుర్తించండి
తుమ్మపాల: పేదరిక నిర్మూలనకు మార్గదర్శులను గుర్తించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ‘పేదరిక నిర్మూలన–మార్గదర్శి–బంగారు కుటుంబం పీ 4 జీరో పావర్టీ’ కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. అట్టడుగు వర్గంలో ఉన్న 20 శాతం కుటుంబాలను ఆదుకోవడం కోసం పీ 4 సర్వే ద్వారా సమాజంలో సేవా దృక్పథం కలిగిన మార్గదర్శులను గుర్తించాలన్నారు. జిల్లాలో 64,475 బంగారు కుటుంబాలను పీ 4 సర్వే ద్వారా గుర్తించామని, ఈ కుటుంబాలకు ఉన్నత స్థాయిలో ఉన్న వివిధ వర్గాల నుంచి మార్గదర్శులను ఎంచుకుని, ఈ మార్గదర్శులను బంగా రు కుటుంబంతో అనుసంధానం చెయ్యాలన్నారు.
పాడి రైతుల అభివృద్ధికి కృషి
పశుసంవర్ధక శాఖ పనితీరు, పురోగతిపై నిర్వహించిన త్రైమాసిక సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పశు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పాడి రైతుల అభివృద్ధికి దోహదపడే పథకాలను ప్రజలకు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రైతుల్లో చాలామంది ఒక పశువుతో జీవనం సాగిస్తున్నారని వారి జీవన నైపుణ్యం పెంచేందుకు వెలుగు ద్వారా రెండో పశువును అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయా లని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పురోగతి, పనితీరు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణులను ముందుగా గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు.
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్