
అభివృద్ధి పేరిట అరాచకాలు
●టీడీఆర్‌లపై కూటమి కుయుక్తులు
పేరు అభివృద్ధి.. చేసేది అరాచకం.. ఇదీ కూటమి ప్రభుత్వ సిద్ధాంతం. ఎస్‌ఈజెడ్‌లో కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేసేందుకు రెండు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణకు నిర్వాసితులను ఒప్పించాలని చూశారే గానీ నొప్పించే విధంగా ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. ఇళ్లు, దుకాణాలు, పొలాలను కోల్పోయేందుకు మనసు రాక.. కాదనలేక మధనపడుతున్న బాధితుల పట్ల నేటి చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిహారం ఇచ్చి తమ బతుకులకు ప్రత్యామ్నాయం చూపిస్తారని ఆశిస్తున్న నిర్వాసితుల మెడకు ఇప్పుడు టీడీఆర్ గుదిబండ వేలాడుతోంది.
అచ్యుతాపురం: రహదారి విస్తరణ మాట విన్నప్పుడల్లా నిర్వాసితుల గుండెల్లో రాయి పడుతుంది. పరిశ్రమల స్థాపన కోసం అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల్లో వేలాది ఎకరాలు ఇవ్వాల్సివచ్చింది. అంతలోనే అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ ప్రతిపాదన వచ్చింది. సుమారు 14 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అగ్రహారం, నాగులాపల్లి, ఒంపోలు, గంగాదేవిపేట, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల, చోడపల్లి, మోసయ్యపేట గ్రామాలకు చెందిన రైతుల భూములు, ఇంటి స్థలాల మీదుగా రహదారిని విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 30–40 అడుగుల వెడల్పులో ఉన్న ఈ రహదారి విస్తరణ ఆవశ్యకత కచ్చితంగా ఉంది. అయితే విస్తరణ విషయంలో స్పష్టత లేకపోవడం, ఎన్ని అడుగులు విస్తరిస్తారో తెలియకపోవడంతో 1200 బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. స్పష్టత వచ్చాక తగిన పరిహారం ఇచ్చి ఆదుకోకపోతారా అన్న ఆశతో ఉన్న వారికి కూటమి సర్కారు తీసుకొచ్చిన టెర్ట్ డిపాజిట్ రిసీట్ (టీడీఆర్) ప్రతిపాదన పెద్ద శాపంగా పరిణమించింది.
దీని ప్రకారం పరిహారం ఇవ్వకుండా ప్రస్తుతం బాండ్లు ఇస్తారు. నిర్ణీత కాల వ్యవధి ముగిశాక ఆ బాండ్లపై సొమ్ము ఇస్తారు. ఈ ప్రతిపాదనతో తీవ్ర నిరాశకు లోనైన నిర్వాసితులు ఆందోళనల రూపంలో తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. రాస్తారోకోలు, బైఠాయింపులు చేపట్టి తమ వ్యతిరేకత వ్యక్తపరిచారు. వారి బాధను అర్థం చేసుకోవలసింది పోయి ప్రభుత్వం వారిని ఒప్పించడానికి సామ, దాన, భేద దండోపాయాలు ప్రదర్శిస్తోంది. ఇందుకు కూటమి పార్టీల కార్యకర్తలు అన్ని గ్రామాల్లో రంగంలోకి దిగారు.
లోలోన భయం.. అందుకే ప్రలోభాల పర్వం
నిజానికి అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ ప్రతిపాదన ఇప్పటిది కాదని అందరికీ తెలుసు. అత్యంత కీలకంగా మారిన ఈ మార్గం విస్తరణ కోసం రైతుల నుంచి భూమిని ఏకాభిప్రాయంతో తీసుకోవాలంటే వారు మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి. అంటే మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించి రైతులకు నుంచి తీసుకోవాలి. కానీ నిధులన్నీ అమరావతి వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణల మేరకు ఈ ప్రాంత నిర్వాసితులకు నేరుగా నగదు ఇవ్వకుండా టీడీఆర్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. రావాల్సిన పరిహారం కంటే మూడో వంతు తగ్గిపోవడం, అది కూడా ఎందుకూ కొరగాకుండాపోయే టీడీఆర్‌లను బలవంతంగా రుద్దాలనే కుయుక్తుల మేరకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ మార్గ విస్తరణకు సంబంధించి రెండు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులు, ఫ్లై ఓవర్లతో కూడిన పనులు ప్రారంభించిన తరుణంలో రైతులు భూములు ఇవ్వకుంటే పనులు ఎక్కడ ఆగిపోతాయో అన్న భయం కూటమి బడా ప్రతినిధుల్లో నెలకొంది. అందుకే తమ కార్యకర్తలను రంగంలోకి దింపి బాధితులను ప్రలోభాలను గురిచేసే పన్నాగానికి తెరలేపారు. విభజించి పాలించు అనే నినాదంతో నిర్వాసితులను విడివిడిగా కలిసి ఎన్‌వోసీపై సంతకం చేయాలని, వారికి కావాల్సిన ఏ ప్రభుత్వ పనైనా చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. వారు అంగీకరించకపోతే భయపెట్టయినా తమ పని పూర్తి చేసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. దీంతో రైతులు మరింత మండిపడుతున్నారు.
టీడీఆర్‌లకు వ్యతిరేకంగా తిమ్మరాజుపేటలో రోడ్డుపై ధర్నా చేస్తున్న నిర్వాసితులు (ఫైల్)
సంతకం పెట్టేది లేదు
మాది తిమ్మరాపుపేట. రెండు సెంట్ల స్థలం, దుకాణం ఉంది. 30 ఏళ్లుగా ఆ దుకాణం మీదే ఆధారపడి జీవిస్తున్నాను. టీడీఆర్ ప్రతిపాదన వల్ల మాకు రావాల్సిన పరిహారంలో 40 శాతమే అందుతుంది. పైగా టీడీఆర్‌లను ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించుకోగలం. మరోవైపు ఉపాధి పోతుంది. పరిహార నగదు ఇస్తేనే సంతకం పెడతాం.
–రామారావు, తిమ్మరాజుపేట
ఈ పద్ధతిని ఆమోదించం
రోడ్డు వేయడం తప్పు కాదు. మాకు ఇవ్వాల్సిన పరిహారం న్యాయంగా మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలి. 36 గజాల స్థలం, దుకాణం ఉన్నాయి. ఎన్‌వోసీపై సంతకం పెట్టేదిలేదు. అవసరమైతే కోర్టుకై నా వెళతాం. నియోజకవర్గ ప్రజలు కష్టాలను చూసి పరిహారం ఇప్పించాలే తప్ప, ఇలాంటి పద్ధతి సరికాదు.
–ఈశ్వర్ కుమార్, ఒంపోలు
●

అభివృద్ధి పేరిట అరాచకాలు