
వేగం, విశ్లేషణ..అదే విజయ రహస్యం
● సివిల్స్ విజేత సాయి మోహిని మానస
రావాడ సాయి మోహిని మానసను సత్కరిస్తున్న గ్రంథాలయం సభ్యులు
అనకాపల్లి టౌన్: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పునశ్చరణ, నమూనా పరీక్షలతో వేగంగా సమాధానాలు రాయడం అలవాటు చేసుకోవాలని సివిల్స్ విజేత రావాడ సాయి మోహిని మానస సూచించారు. వేగానికి విశ్లేషణ కూడా తోడైతే సివిల్స్ పరీక్షల్లో విజయానికి చేరువ కాగలుగుతామని చెప్పారు. ఇటీవల విడుదలైన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్ధాయిలో 975వ ర్యాంకు సాధించిన మానసను గౌరీ గ్రంథాలయం సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల్లో సమయ పాలన, వేగం కీలకమని, ఇందుకోసం అభ్యర్థి రోజుకు ఒకటి రెండు ఆన్‌లైన్ నమూనా పరీక్షలు రాసి స్వీయ విశ్లేషణ చేసుకోవాలని చెప్పారు. పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగానే ఉంటాయన్నారు. గ్రంథాలయ అధ్యక్ష, కార్యదర్శులు డి.నూక అప్పారావు, కాండ్రేగుల వెంకటరమణ, కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
8లో