
వరి పంట వ్యర్థాల నుంచి ఇంధన తయారీ!
● అవకాశాలను పరిశీలించిన ఎస్‌ఏఈఎల్ సంస్థ
జోగారావుపేటలో స్థల పరిశీలన
కశింకోట: పేరంటాలపాలెం శివారు జోగారావుపేట గ్రామంలో ఢిల్లీకి చెందిన సస్టెయినబుల్ అండ్ ఎఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ (ఎస్‌ఎఈఎల్) సంస్థ ప్రతినిధుల బృందం సోమవారం స్థల పరిశీలన జరిపింది. సంస్థ ఉపాధ్యక్షుడు నరేంద్ర సింగ్ నాయకత్వంలోని బృందం వరి పంట వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై వివరాలను సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి గల అవకాశాల గురించి పరిశీలించింది. మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.