
పీజీఆర్‌ఎస్‌లో నిరసనల హోరు
బతికేందుకు ఆధారం చూపండి..
నా భర్త గంగరాజు పేరున ఉన్న ఐదెకరాలను కుమారుడు పేరున పాసు పుస్తకాలు చేయించుకుని అనుభవిస్తున్నాడు. నేను బతకడానికి ఏమీ ఇవ్వడం లేదు. గతంలో తహసీల్దార్, ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. నా కొడుకు దగ్గర ఉన్న భూమిలో రెండెకరాలైనా ఇవ్వాలని కలెక్టరు అమ్మను వేడుకున్నా.
– అనిమిరెడ్డి రాజులమ్మ, బుచ్చంపేట, రోలుగుంట మండలం
భూమిని సరి చేయాలి..
మాకవరపాలెం మండలం, గంగవరం రెవెన్యూ పరిధిలో 35 సెంట్లు స్థలం కొనుకున్నా. జిరాయితీ భూమిని ఆన్‌లైన్‌లో ఇనాం భూమిగా చూపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా ప్రయోజనం లేదు. ఆప్షన్ లేదని అధికారులు చెప్పుతున్నారు. కలెక్టర్ న్యాయం చేస్తారని అర్జీ పెట్టుకున్నాను.
– పైల సత్యవతి,
కేడీ పేట, గొలుగొండ మండలం
నర్సీపట్నం: సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు పోటెత్తారు. సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. ఉదయం 10 గంటలకు రావాల్సిన కలెక్టర్ విజయ కృష్ణన్ 11.15 గంటలకు వచ్చారు. కలెక్టర్ రాక కోసం అర్జీదారులు నిరీక్షించారు. ఎట్టకేలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి వచ్చి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు మూకుమ్మడిగా రావడంతో తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని క్యూ ఏర్పాటు చేశారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అర్జీదారులు మండుటెండలో క్యూకట్టారు. ఎండకు తాళలేక తలపై అర్జీ పేపర్లను పెట్టుకున్నారు. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం లోపల నిరసనలు తెలిపారు. అధికారుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్‌కు తమ గోడు విన్నవించుకునేందుకు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. గుంపుగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గొలుగొండ మండలం డొంకాడ గ్రామ గిరిజనులు డోలీ మోతతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
సకాలంలో అర్జీలకు పరిష్కారం
పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి డివిజన్, మండల స్థాయి అధికారులు కచ్చితంగా హాజరు కావాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవో వి.వి.రమణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలను వివరంగా దరఖాస్తుదారుడికి తెలియజేస్తే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 252 అర్జీలు నమోదు కాగా.. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 122, మున్సిపల్ 57, పోలీసు 11, ఇతర శాఖలకు సంబంధించి 62 అర్జీలు వచ్చాయి.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో 252 అర్జీల స్వీకరణ
అధికారులు విధిగా హాజరు కావాలి : కలెక్టర్ విజయ కృష్ణన్

పీజీఆర్‌ఎస్‌లో నిరసనల హోరు

పీజీఆర్‌ఎస్‌లో నిరసనల హోరు

పీజీఆర్‌ఎస్‌లో నిరసనల హోరు

పీజీఆర్‌ఎస్‌లో నిరసనల హోరు