
విశాఖ రియల్టర్ ఆత్మహత్య
● ఆర్థిక ఇబ్బందులే కారణం ● సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ● మామిడిపల్లి రిసార్ట్‌లో ఘటన
దేవరాపల్లి : విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణరాజు(70) దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని రిసార్ట్‌లోని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విశాఖకు చెందిన సత్యనారాయణరాజు 40 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా కొంత మంది నుంచి తనకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో ఉండిపోయాయి. దీంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. దేవరాపల్లి మండలం మామిడిపల్లి రిసార్ట్‌కు సత్యనారాయణరాజు అప్పుడప్పుడు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రిసార్ట్‌కు వచ్చిన ఆయన మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశారు. సోమవారం ఉదయం రిసార్టు మేనేజర్ రాయిశివ చూసేసరికి గది బయట ఉన్న ఊయల కొక్కానికి సత్యనారాయణరాజు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని దేవరాపల్లి పోలీసులతో పాటు మృతుని బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయే ముందు తనకు రావలసిన బకాయిల గురించి, ఆరుగురికి విడివిడిగా రాసిన ఉత్తరాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణరాజు రిసార్ట్‌కు వచ్చినప్పుడల్లా తీవ్రంగా మదనపడుతూ ఏడ్చేవారని రిసార్టులో పని చేస్తున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. మృతుడు భార్య, కుమారుడు సాయి చైతన్యవర్మ అందించిన సమాచారం మేరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జి ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు.