
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం శివపురానికి చెందిన కొరుప్రోలు వెంకట కనక సర్వారావు(47) మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్‌లోని ఓ కిరాణా షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామం ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం వెళ్లాడు. తిరిగి సోమవారం మధ్యాహ్నం బైక్‌పై వేగంగా వస్తూ రామచంద్రపురం జంక్షన్‌కు శివారున రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య నాగరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడేమో..
సర్వారావు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే మృతుడు వస్తున్న బైక్‌కు వెనక హెల్మెట్ లాక్ చేసి ఉంది. హెల్మెట్‌ను వాహనానికి పెట్టేకంటే తలకు పెట్టుకుని ఉంటే స్వల్ప గాయాలతో బయటపడేవాడని ఘటనా స్థలంలో స్థానికులు చర్చించుకున్నారు.