
దివ్యాంగులకు చేయూత
అచ్యుతాపురం రూరల్: విధి చిన్నచూపు చూసిన దివ్యాంగులను సాటి మనుషులే ఆదుకోవాలని, ప్రేమాభిమానాలతో బాధ మరిచిపోయేలా చేయాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. కొండకర్ల ఆవకు సమీపంలో ఉన్న ఇచ్ఛా ఫౌండేషన్‌ను ఆయన సోమవారం సతీమణితో కలిసి సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులే తమకెందుకులే అనుకుంటున్న ప్రస్తుత సమయంలో దివ్యాంగ బాలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఇచ్ఛా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధు తుగ్నైట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినా కేవలం దాతల సహకారంతోనే సంస్థను నడిపించడం చాలా గొప్ప విషయమన్నారు. అవకాశం ఉన్నవారు దివ్యాంగులకు అవసరమైన గృహోపకరణాలు అందివ్వాలని కోరారు. తన వంతు సహాయంగా రూ.25 వేలు ఫోన్–పే ద్వారా సంస్థకు అందజేశారు. ఈ సందర్భంగా మరికొందరు ప్రముఖులు వారి పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంగా సంస్థకు చెక్కులు, నగదు రూపంలో విరాళాలు అందజేశారు.
ఒడిశా గవర్నర్ హరిబాబు పిలుపు