
షోర్ టు షోర్ జీఎం దిలీప్ పింటోను అరెస్టు చేయాలి
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ షోర్ టు షోర్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేసిన తనపై జనరల్ మేనేజర్ దిలీప్ పింటో లైంగికంగా వేధించి, ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనపై కోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ఛత్తీష్‌గఢ్‌కు చెందిన బాధితురాలు డిమాండ్ చేశారు. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆమె డీఆర్వోకు వినతిప్రతం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకుడు దౌలత్ రామ్ మాట్లాడుతూ నిందితుడు దిలీప్ పింటోనీ అరెస్ట్ చేయకపోవడంతో శ్రీలంకకు పారిపోయాడన్నారు. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చి, పరిహారం చెల్లించాలని జాతీయ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయలేదని ఆరోపించారు. గత పదేళ్లుగా బాధితురాలు అన్యాయానికి గురవుతుందనే విషయాన్ని పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరులు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటలక్ష్మి, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం కో– కన్వీనర్ రూప, భీమ్ సేన వార్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జాతీయ ఎస్సీ, ఎస్టీ సంఘాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.