
తెలిసినవారి పనేనా?
కూర్మన్నపాలెం: రాజీవ్‌నగర్‌లో జరిగిన దంపతుల హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. తొలుత ఈ హత్యలను దోపిడీ దొంగలే చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన మృతుల కుమార్తె, కుమారుడు ఇంట్లోని బీరువాలను తెరిచి పరిశీలించగా.. అందులో నగదు, బంగారు నగలు చెక్కు చెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సమక్షంలోనే బీరువాలను పరిశీలించగా 30 తులాల బంగారం, రూ. 10 వేల నగదు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ హత్యలు డబ్బు లేదా ఆభరణాల కోసంజరగలేదని స్పష్టమైంది. ఈ కీలక పరిణామంతో హత్యలపై పోలీసుల దర్యాప్తు కోణం మరో మలుపు తిరిగింది. ఘటనా స్థలంలోని పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తే.. వారికి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వంట గదిలో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే రెండు కత్తులతోనే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటితో బాగా పరిచయం ఉన్న వారికే వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు.. ఇప్పుడు దర్యాప్తును ఆ దిశగా మళ్లించారు. దీంతో మృతుల కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారిని, ఇంటికి తరచుగా వచ్చిపోయే వారిని, ఆ కుటుంబ సభ్యులకు చనువుగా ఉండేవారి వివరాలను సేకరించి.. వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై నగర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రైం పోలీసులు, అధికారులు మఫ్టీలో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడంతో.. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కొలిక్కిరాని దంపతుల హత్య కేసు