
కేజీబీవీల్లో రూ.8.55 కోట్లతో అదనపు భవనాలు
దేవరాపల్లి : జిల్లాలో 19 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.8.55 కోట్లతో మనబడి మన భవిష్యత్ పథకంలో అదనపు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ తెలిపారు. మండలంలోని బేతపూడి కేజీబీవీలో రూ.51.93 లక్షలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను స్థానిక ఏఈ పి.సంతోష్‌కుమార్‌తో కలిసి ఆదివారం పర్యవేక్షించారు. కాగా భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో రూ.51.93 లక్షలు మంజూరు చేయగా, అప్పట్లో రూ.28 లక్షలకు సంబంధించి పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనబడి– మన భవిష్యత్‌గా పేరు మార్చి పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయిని డీఈ గణేష్ తెలిపారు. బేతపూడి కేజీబీవీకి కూడా జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్ సైతం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ భవనాలలో ఆరు డార్మెటరి గదులు, రెండు టాయిలెట్లు ఉంటాయన్నారు. మనబడి– మన భవిష్యత్ పథకంలో అదనపు భవనాల నిర్మాణ పనులను వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఈ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు సైతం పక్కాగా పాటిస్తూ పనులు చేపడుతున్నట్టు వివరించారు.
12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాలకు నిధులు మంజూరు
సమగ్ర శిక్ష డీఈ గణేష్ వెల్లడి