
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనిత
సింహాచలం: ఈనెల 30న జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అప్పన్న స్వామి నిజరూపదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి ఆదివారం పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అంతరాలయ దర్శనాలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు మాత్రమే ఉంటాయన్నారు. ఉదయం 6 తర్వాత అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అంతరాలయ తలుపులు మూసివేసి తాళాలు వేసుకుని దగ్గర ఉంచుకోవాలని ఆలయ వైదికులు, అధికారులకు సూచించారు.