
సొమ్మొకరిది...సోకొకరిది..!
నక్కపల్లి : మండలంలో వేంపాడు సబ్‌స్టేషన్‌లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో 5 మెగా వాట్ల పవర్‌ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుపై టీడీపీ నాయకులు పచ్చ ప్రచారానికి తెరలేపారు. రైతులకు వ్యవసాయం కోసం పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను తమ ప్రభుత్వంలో మంత్రి అనిత మంజూరు చేయించారంటూ తాజాగా రెండు రోజుల క్రితం కొబ్బరి కాయకొట్టి ప్రారంభించడం నవ్వుల పాలు చేస్తోంది. వాస్తవంగా ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను అధికారులు 15 రోజుల క్రితమే ప్రారంభించి రైతులకు పగటి పూట వ్యవసాయ అవసరాల కోసం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
వేంపాడు సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ కొరత ఉంది. దీంతో వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు త్రీఫేజ్ సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. వారంలో మూడు రోజులు అర్ధరాత్రి , నాలుగు రోజులు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ సమస్యను రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ, అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి సుమారు రూ.2 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్‌కు 5 మెగావాట్ల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో మంజూరు చేయించారు. ఈ ట్రాన్స్‌పార్మర్ ఏర్పాటు చేసే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ ఏడాది మార్చినాటికి పనులు పూర్తి చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పూర్తయినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పగటిపూట సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు ఈ సమస్యను సాక్షి దృష్టికి తీసుకురావడంతో ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో త్రీఫేజ్ సరఫరా.. ఇబ్బంది పడుతున్న రైతులు అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన ట్రాన్స్‌కో అధికారులు పవర్‌ట్రాన్స్‌ఫార్మర్ పనులు పూర్తి చేశారు. ఏఈ మహంకాలరావు పవర్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఈనెల 14న కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించి రైతులకు పగటిపూట పూర్తి స్థాయిలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీనిపై ఈనెల 16న వేంపాడు సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు (సాక్షి కథనానికి స్పందన) అంటూ కథనం ప్రచురితమైంది. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటై విద్యుత్ సరఫరా యథావిధిగా జరుగుతున్న తరుణంలో కొంతమంది టీడీపీ నాయకులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగిందంటూ రెండు రోజుల క్రితం కొబ్బరికా య కొట్టి రెండోసారి ప్రారంభోత్సవం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు మణి రాజు ఆదివారం సబ్‌స్టేషన్‌లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేంపాడు పరిసర ప్రాంత రైతులు విద్యుత్ సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకు రావడంతో సుబ్బారెడ్డి దృిష్టికి తీసుకెళ్లి సుమారు రూ.2 కోట్ల వ్యయంతో 5 మెగావాట్ల పవర్‌ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఇది మంజూరయిందని, ఏర్పాటు పనులు పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టిందన్నారు. నిధులు మంజూరు ఉత్తర్వులు రావడం, పనులు ప్రారంభం కావడం అన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని, కొంతమంది టీడీపీ నాయకులు తమ ప్రభుత్వంలోనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైందంటూ గొప్పలు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 11 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కూడా తమ ఖాతా లో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే తాము సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, ఈశ్వరరావు, చందనాడ సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, నెల్లిపూడి సర్పంచ్ సురేష్ వర్మ, పార్టీ మండలశాఖ మాజీ అధ్యక్షుడు పాపారావు, సీతంపాలెం ఎంపీటీసీ గోవిందు, పార్టీ నాయకులు అల్లాడ కొండ, బాబ్జి, సూరిబాబు, పిక్కి సత్తియ్య పాల్గొన్నారు.
పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుపై పచ్చ ప్రచారం
గత ప్రభుత్వంలో రూ.2 కోట్లతో మంజూరు
15 రోజుల క్రితమే ప్రారంభించిన అధికారులు
తాజాగా మంజూరైనట్టు మళ్లీ
ప్రారంభోత్సవం చేసిన కూటమి నేతలు

సొమ్మొకరిది...సోకొకరిది..!

సొమ్మొకరిది...సోకొకరిది..!