● వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఆలయ నిర్మాణం ● స్పీకర్ ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం : నూకాలమ్మ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడి సొమ్ము తినాలని ఎవరూ అనుకోరన్న విషయాన్ని స్పీకర్ గ్రహించాలన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో కంట్రిబ్యూషన్ కింద రూ.10 లక్షలు చెల్లించారు. ఎన్నికలు మూడు నెలలు ఉండగా ఆలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అప్పలనాయుడు 2019 డిసెంబరులో నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.40 లక్షల వ్యయంతో నూతన గుడిని నిర్మిస్తే తానే కట్టానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 లక్షలు, కంట్రిబ్యూషన్ రూ.10 లక్షలు మొత్తం రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండడంతో నూకాలమ్మ ఆలయానికి సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణను ఆర్ధిక సాయం కోరడం జరిగిందన్నారు. సీఎంఆర్ అధినేత అమ్మవారి ఆలయానికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. సీఎంఆర్ సంస్థ వ్యాపారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలకు విరాళాలు ద్వారా తోడ్పాటునందించడంతో పాటు వారి సంస్థలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చిన విరాళం నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. సీఎంఆర్ సంస్థ ప్రకటించిన రూ.10 లక్షల విరాళానికి సంబంధించి లావాదేవీలన్ని సీఎంఆర్ సంస్థ మేనేజర్, నూకాలమ్మ టెంపుల్ చైర్మన్ ధనిమిరెడ్డి నాగు మధ్య జరిగాయన్నారు. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్నది పక్కాగా వివరాలు ఉన్నాయన్నారు. సీఎంఆర్ సంస్థ, చైర్మన్ మధ్య లావాదేవీలు జరిగితే తనపై బురదజల్లడం స్పీకర్‌కు తగదన్నారు. నూకాలమ్మ ఆలయంలో నూతన విగ్రహం ఏర్పాటుకు ఎంత అవుతుందని శిల్పిని సంప్రదిస్తే రూ.లక్షా 50 వేలు అవుతుందన్నారు. అమ్మవారి విగ్రహం కోసం తాను స్వయంగా రూ.లక్ష విరాళంగా ఇచ్చి విగ్రహం తయారు చేయించానన్నారు. విరాళాలను అకౌంట్‌కు ఎలా జమ చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పిందే నిజమైతే ఇదే సీఎంఆర్ అధినేత సుమారు రూ.20 లక్షల విరాళంతో నర్సీపట్నం శ్మశాన వాటికను సుందరీకరణ చేశారు. ఆ నిధులను మున్సిపాలిటీ అకౌంట్‌కు ఎందుకు జమ చేయలేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ పాల్గొన్నారు.